నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. గురువారం రాయదుర్గం పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్లో జరిగిన మెగా కార్యక్రమంలో సుమారు 3,000 మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కాలవ శ్రీనివాసులు తెలిపారు.ఇళ్ల స్థలాల పంపిణీ ద్వారా వేలాది కుటుంబాలకు శాశ్వత నివాస భద్రత కల్పిస్తున్నామని, ఇది వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆయన పేర్కొన్నారు.అర్హులైన ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా పారదర్శకంగా పట్టాల పంపిణీ చేస్తున్నామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో లబ్ధిదారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
