నెల్లూరు జిల్లా కలువాయిలో ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 7 ఎకరాలకు పైగా భూమిని రాత్రికి రాత్రే చదును చేసిన ఘటనపై స్థానికుల ఆందోళన.
మండలంలో భూ ఆక్రమణలు పెరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్రతరమయ్యాయి. తాజాగా కలువాయి గ్రామంలోని సర్వే నెంబర్ 905లో సుమారు 7 ఎకరాల 20 సెంట్ల ప్రభుత్వ భూమిని రాత్రికి రాత్రే చెట్లను తొలగించి చదును చేసిన ఘటన కలకలం రేపుతోంది.ఈ వ్యవహారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న ఆక్రమణపై రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహిస్తున్నారని, కొందరు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇటీవల కాలంలో మండలంలో ఇలాంటి భూ ఆక్రమణలు పెరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణం స్పందించి ప్రభుత్వ భూములను రక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
