భారత సినీ పరిశ్రమలో పెరిగిపోతున్న అనవసరపు ఖర్చులపై ప్రముఖ నటుడు, నిర్మాత కమల్ హాసన్ ధ్వజమెత్తారు. ఆర్థికంగా ఒత్తిళ్లు, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలోనూ విదేశీ షూటింగ్‌ల మోజులో పడి నిర్మాతలను ఎందుకు ఖర్చుల ఊబిలోకి నెడుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా భారత సినీ ప్రముఖులను ఉద్దేశించి ఆయన ఒక ఘాటైన బహిరంగ లేఖను విడుదల చేశారు.
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా ఇంధనం, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని, ఈ తరుణంలో భారతీయ సినిమాకు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం అవసరమని కమల్ అభిప్రాయపడ్డారు. ఈ పొదుపు చర్యలు, ఆర్థిక సర్దుబాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుల వేతనాలపై ప్రభావం చూపకూడదని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల జీతాలు, వారి భద్రత, గౌరవం, ఆహారం, రవాణా, వసతి లేదా మానవతా దృక్పథంతో కూడిన పని వాతావరణం వంటి విషయాల్లో కోత విధించి పొదుపు చేయడం సరికాదన్నారు. ప్రతి ప్రేమకథ పారిస్‌లోనే ఎందుకు వికసించాలి? ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? అదృష్టవశాత్తు ప్రేమకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ అవసరం లేదని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. గొప్పదనం కేవలం విదేశాల్లోనే సాధ్యమవుతుందనే భ్రమ నుంచి బయటకు వచ్చి, మన దేశంలోని అందమైన లొకేషన్లు, ఇక్కడి నిర్మాణ వనరులపై నమ్మకం పెంచుకోవాలని సూచించారు. సినిమా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లపై నిర్మాతలు, నటీనటులు, కార్మిక సంఘాలు, ఎగ్జిబిటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఫైనాన్షియర్లు అందరూ కలిసికట్టుగా చర్చించి ఒక పరిష్కారం కనుగొనాలని కమల్ పిలుపునిచ్చారు.
