కామారెడ్డి: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి పట్టణాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన భూ కబ్జాలు, అవినీతిని ఎండగడుతూ బీజేపీ మాజీ కౌన్సిలర్లు గళమెత్తారు. 34వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల సుజిత భరత్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి నాయకత్వంలో పట్టణంలో భూ కబ్జాలు తగ్గాయని, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. గతంలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయని, ప్రజాదర్బార్ ద్వారా ఇప్పటికే 5 వేల ఫిర్యాదులు అందాయని గుర్తు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ షాపింగ్ మాల్స్, లాడ్జీల అడ్రస్‌లతో వేల సంఖ్యలో దొంగ ఓట్లను సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఓటర్ల జాబితాలో తప్పులపై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా మంగళవారం (జనవరి 13) మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు ప్రకటించారు. డబ్బు, మద్యం ఆశచూపే పార్టీలను నమ్మవద్దని, సామాన్యులకు అండగా నిలిచే బీజేపీకి మున్సిపల్ పీఠాన్ని అందించాలని కోరారు.
