కుక్కకాటుకు చికిత్స కోసం వచ్చిన రెండున్నరేళ్ల చిన్నారి ఇంజక్షన్ తీసుకోగానే మృతి చెందడం కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (GGH)లో పెను కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణం పోయిందని ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప నగర్ కాలనీలో నివసించే రమేష్-అర్చన దంపతుల కుమార్తె క్రితిక్ సార (2.5 ఏళ్లు) గత నెల 25న కుక్కకాటుకు గురైంది. అప్పుడే ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి రెండు డోసుల ఇంజక్షన్లు ఇచ్చారు. ఆదివారం మూడవ డోస్ ఇంజక్షన్ తీసుకోవడానికి తల్లిదండ్రులు చిన్నారిని జిజిహెచ్ (GGH)కు తీసుకువచ్చారు. అయితే, ఇంజక్షన్ వేసిన కొద్దిసేపటికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కంగారుపడిన తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పాప మృతితో ఆగ్రహం కట్టలు తెంచుకున్న బంధువులు, గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. వార్డుల్లోని అద్దాలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు ఆందోళన కొనసాగడంతో రోగులు భయంతో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు భారీగా మోహరించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
