జిల్లాలో రన్నింగ్‌లో ఉన్న కారు ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన మాచారెడ్డి మండల కేంద్రం శివారులో చోటుచేసుకుంది.
కామారెడ్డి–సిరిసిల్ల రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డుపక్కకు నిలిపివేశాడు. వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.దగ్ధమైన కారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన శ్రీనివాస్ గౌడ్‌దిగా గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు.
