తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, రాజమండ్రి శివారు ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ప్రజలు భయాందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ భరోసా ఇచ్చారు. మంగళవారం క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
పులి కదలికలను కనిపెట్టడానికి డ్రోన్ కెమెరాలు, 10కి పైగా హై-రిజల్యూషన్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తొర్రేడు, సీతానగరం, దివాన్ చెరువు పరిసరాల్లో పులిని బంధించేందుకు ఎరలతో కూడిన బోనులను అమర్చారు. ప్రజలను హెచ్చరించేందుకు ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పులి పట్టుబడే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ముఖ్యంగా రైతులు, కూలీలు పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకూడదని, గుంపులుగా వెళ్లాలని సూచించారు. రాత్రి సమయాల్లో పశువుల పాకల వద్ద ఎక్కువ వెలుతురు ఉండేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజల రక్షణే తమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు.