వివాహం పేరుతో మహిళల స్వేచ్ఛను నియంత్రించలేరు
వివాహం తర్వాత మహిళ తన స్వతంత్రతను, ప్రాథమిక స్వేచ్ఛను కోల్పోదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.
భార్యను ఇంటి పనులు చేయాలని బెదిరించడం, పుట్టింటికి వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని తెలిపింది.
పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి అవసరం లేదు
మహిళ పుట్టింటికి వెళ్లాలనుకుంటే భర్త లేదా అత్తమామల అనుమతి తప్పనిసరి కాదని జస్టిస్ డాక్టర్ చిల్లకూరు సుమలత స్పష్టం చేశారు.
వివాహబంధం పేరుతో మహిళ వ్యక్తిగత నిర్ణయాలను నియంత్రించడం తగదని చెప్పారు.
పెళ్లి తర్వాత భర్త, అత్తమామలను గౌరవంగా చూసుకోవడం, వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం బాధ్యతే అయినప్పటికీ.. ఆ పేరుతో మహిళపై దాష్టీకానికి దిగడం లేదా మానసిక, శారీరక వేధింపులకు గురిచేయడం సమర్థనీయం కాదని ధర్మాసనం పేర్కొంది.
భార్యను ఇంటిపని చేయాలని బెదిరించడం తప్పు
భార్యను ఇంటి పనులు చేయాలని బలవంతం చేయడం, బెదిరించడం, కన్నవారింటికి వెళ్లకుండా అడ్డుకోవడం ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని కోర్టు తెలిపింది.
మెట్టినింట్లో మహిళలకు గౌరవప్రదమైన వాతావరణం ఉండాలని స్పష్టం చేసింది.
నెలకు రూ.9,000 జీవన భృతి
విడాకులు తీసుకున్న భార్యకు జీవన భృతి కింద నెలకు రూ.9,000 చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు.
పిటిషన్ను విచారించిన జస్టిస్ డాక్టర్ చిల్లకూరు సుమలత.. భర్త దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను కొట్టివేశారు.
తల్లీ, బిడ్డ అవసరాల కోసం రోజుకు రూ.300 చొప్పున లెక్కించి నెలకు రూ.9,000 జీవన భృతి చెల్లించాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరైనవేనని ధర్మాసనం తెలిపింది.



