ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని అమర్చిన ల్యాండ్ మైన్ ఒక్కసారిగా పేలింది.
ఈ పేలుడులో 39వ బెటాలియన్‌కు చెందిన ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. జవాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆర్మీ హెలికాప్టర్ (చాపర్) ద్వారా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. శనివారం ఉదయం నుంచి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చేపట్టగా, ఇప్పటివరకు సుమారు 11 ఐఈడీ (IED)లను గుర్తించి బాంబ్ స్క్వాడ్ సాయంతో నిర్వీర్యం చేశారు. పేలుడు నేపథ్యంలో అప్రమత్తమైన అదనపు బలగాలు కర్రెగుట్టల పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.
