వివాహమై రెండు నెలలు గడవక ముందే ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన కార్తీక్, మంజుల దంపతులు మరుసటి రోజు ఉదయం విగతజీవులుగా కనిపించారు. వీరికి ఆర్థిక సమస్యలు లేవని, ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందోనని కుటుంబ సభ్యులు వాపోయారు. శుక్రవారం అర్ధరాత్రి తొలుత మంజుల పురుగుల మందు తాగి మృతి చెందడంతో కార్తీక్ ఉదయం ఉరి వేసుకున్నట్లు భావిస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడిన నవ దంపతులు కార్తీక్, మంజులలకు కూకట్పల్లిలోని వెంకటరావునగర్ కాలనీలోని హిందూ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఒకే చితిపై దహన సంస్కారాలు చేశారు.
కూకట్పల్లి కుమ్మరిబస్తీకి చెందిన కార్తీక్, మంజులల వివాహం జరిగి 2 నెలలు కాకముందే భర్త ఉరేసుకుని, భార్య పురుగుల మందు తాగి చనిపోయారు. పరస్పరం ప్రేమించి తమను ఒప్పించి పెళ్లి చేసుకున్న వారు సమస్యల్లో ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదని మృతుల బంధువులు చెబుతున్నారు. పైగా బలవన్మరణానికి పాల్పడటానికి ముందురోజు రాత్రి నిద్రపోయేవరకు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. చనిపోవాలని ఇద్దరూ అనుకుంటే ఒకే తరహాలో బలవన్మరణానికి పాల్పడి ఉండేవారు.
