ఓ రైతుకు దొరికిన 3 గ్రాముల బంగారు ముక్క.. గ్రామానికి వేలాది మంది క్యూ
ఆఫ్రికాలోని ఓ మారుమూల గ్రామం ఇప్పుడు బంగారం కోసం వచ్చిన వేలాది మందితో కిటకిటలాడుతోంది.
ఓ సాధారణ రైతుకు బంగారు ముక్క దొరికిందన్న వార్త వైరల్ కావడంతో.. ఆ గ్రామానికి జనం పోటెత్తారు.
బంగారం కోసం పెద్ద ఎత్తున వెతుకులాట మొదలైంది.
పశువుల కాపరికి దొరికిన బంగారు ముక్క
కెన్యాలోని వెస్ట్ పోకోట్ కౌంటీ పరిధిలో చెపోరోర్ అనే మారుమూల గ్రామం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్న సమయంలో.. ఇక్కడ ఉచితంగా బంగారం దొరుకుతోందన్న వార్త ఆసక్తిని పెంచింది.
గ్రామానికి చెందిన పశువుల కాపరి మనాస్సే లోమచార్ నది ఒడ్డున కొంతమంది మహిళలు మట్టిలో బంగారం కోసం జల్లెడ పడుతుండటాన్ని గమనించాడు.
దీంతో అతను కూడా వారితో కలిసి బంగారం కోసం వెతకడం మొదలుపెట్టాడు.
అతనికి అనూహ్యంగా 3 గ్రాముల బంగారు నగ్గెట్ దొరికింది.
ఆ బంగారు ముక్కను విక్రయించగా సుమారు 36 కోట్ల కెన్యా షిల్లింగ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 26,615 సంపాదించినట్లు కథనంలో పేర్కొన్నారు.
వైరల్‌గా మారిన వార్త.. వేలాదిగా జనం
ఒక సాధారణ వ్యక్తికి సులభంగా బంగారం దొరికిందన్న వార్త వేగంగా వ్యాపించింది.
దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు చెపోరోర్ గ్రామానికి రావడం మొదలుపెట్టారు.
పక్కనే ఉన్న ఉగాండా నుంచి కూడా చాలామంది అక్కడికి చేరుకున్నారు.
ఒక దశలో గ్రామానికి 10 వేల మందికి పైగా జనం వచ్చినట్లు సమాచారం.
ఆ ప్రాంతంలో చిన్నపాటి బంగారు రేణువులు దొరకడం సాధారణమే అయినప్పటికీ.. ఈసారి గట్టిగా ఉన్న బంగారు నగ్గెట్ దొరికిందన్న వార్త ప్రజల్లో ఆశలు పెంచింది.
కుటుంబాలను పోషించుకోవడానికి ఇదో పెద్ద అవకాశంగా మారుతుందని కొందరు భావిస్తున్నారు.
గ్రామంలో కొత్త వ్యాపారాలు
భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో చెపోరోర్ గ్రామం రూపురేఖలు మారిపోయాయి.
ఒక్కసారిగా పెరిగిన జనాభాతో అక్కడ 200కు పైగా కొత్త దుకాణాలు ఏర్పడ్డాయి.
ఆహారం, తాగునీరు వంటి వస్తువులను విక్రయిస్తూ కొందరు ఈ గోల్డ్ రష్‌ను వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు.
తాగునీరు, పారిశుద్ధ్యంపై ఆందోళన
అయితే వేలాది మంది ఒక్కసారిగా గ్రామానికి రావడంతో సమస్యలు కూడా పెరిగాయి.
తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా మారుతున్నాయి.
గ్రామంలోని మౌలిక వసతులపై భారీ ఒత్తిడి పడుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజంగానే ఆ ప్రాంతంలో భారీగా బంగారం ఉందా? లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
అయితే చెపోరోర్ గ్రామంలో మొదలైన ఈ ‘గోల్డ్ క్రేజ్’ మాత్రం సోషల్ మీడియాలో, స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.



