మహిళలు బహిరంగ సమాజంలోకి రావొద్దన్న గ్రాండ్ ముఫ్తీ
కేరళకు చెందిన ప్రముఖ ఇస్లామిక్ మతగురువు, గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ (కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
కొచ్చిలో జరిగిన ‘హబ్బాయిల్ రసూల్’ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బంగారు ఆభరణాలతో మహిళల పోలిక
కాంతపురం తన ప్రసంగంలో మహిళలను బంగారంతో పోల్చారు.
విలువైన బంగారు హారాన్ని కొనుగోలు చేసినప్పుడు దాన్ని కప్‌బోర్డ్ లేదా పెట్టెలో జాగ్రత్తగా భద్రపరుస్తారని చెప్పారు.
అదే రోకలి బండలను రోడ్డు పక్కన ఉంచినట్లు బంగారాన్ని కూడా బయట పెడితే దాని విలువ, అందం దెబ్బతింటాయని అన్నారు.
మహిళలు కూడా బంగారు ఆభరణాల్లాంటి వారని కాంతపురం వ్యాఖ్యానించారు.
వారి అందం, గౌరవం కాపాడాలంటే ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.
మహిళలను సమాజంలోకి స్వేచ్ఛగా అనుమతిస్తే తీవ్ర నష్టం లేదా వినాశనం జరిగే అవకాశం ఉందని అన్నారు.
అందుకే ఇస్లాంలో పర్దా విధానాన్ని నిర్దేశించారని ఆయన వాదించారు.
ఖురాన్, చరిత్రను ప్రస్తావించిన కాంతపురం
ఖురాన్ ప్రకారం మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని స్పష్టంగా ఉందంటూ కాంతపురం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
సమస్త కేరళ జమియ్యతుల్ ఉలమా శతాబ్ద కాలంగా ఇదే విషయాన్ని బోధిస్తోందని చెప్పారు.
ఈ విధానం వల్లే దేశంలోని మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకోగలుగుతున్నారని తెలిపారు.
ఇది మహిళల హక్కులను తగ్గించడం కాదని, వారికి గౌరవం ఇవ్వడమేనని కాంతపురం చెప్పారు.
ఇస్లాం పూర్వ కాలంలో అరబ్ సమాజంలో ఆడపిల్లల హత్యలను ఇస్లాం నిషేధించిందని గుర్తుచేశారు.
అదే సమయంలో మహిళలకు ఆస్తి హక్కులు కల్పించి వారి స్థాయిని పెంచిందని పేర్కొన్నారు.
కాబట్టి బహిరంగ ప్రదేశాలపై ఉన్న ఆంక్షలను మహిళలకు ఇచ్చే గౌరవంగా చూడాలని అన్నారు.
విమర్శకులకు ఘాటు సమాధానం
తన వ్యాఖ్యలు, మతపరమైన అధికారాన్ని ప్రశ్నిస్తున్న సంస్థలపై కాంతపురం మండిపడ్డారు.
తాము మతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశామని చెప్పారు.
అందువల్ల మతం గురించి మాట్లాడే పూర్తి హక్కు, బాధ్యత తమకు ఉన్నాయని స్పష్టం చేశారు.
“మేము ఈ విషయాలను చెబుతూనే ఉంటాము. మమ్మల్ని ఎవరూ ఆపలేరు” అని కాంతపురం తేల్చి చెప్పారు.
తాము ఇతర మతాల ఆచారాల్లో జోక్యం చేసుకోవడం లేదని అన్నారు.
తమ సమాజానికి దిశానిర్దేశం చేసే హక్కు తమకు ఉందని విమర్శకులకు సమాధానమిచ్చారు.
ఆల్ ఇండియా సున్నీ జమియ్యతుల్ ఉలమా ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్న కాంతపురం వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.



