కొండా సుస్మిత సంచలన పోస్ట్.. సీఎం రేవంత్‌కు సవాల్?

August 19, 2026 12:03 PM
Konda Sushmitha and Parakala Congress political developments

పరకాల కాంగ్రెస్‌లో పెరుగుతున్న రాజకీయ వేడి
రేవూరి వర్సెస్ కొండా ఫ్యామిలీ.. అధిష్టానం నిర్ణయంపై ఆసక్తి

Parkal Politics ;తెలంగాణలో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

మంత్రి కొండా సురేఖ కుమార్తెKonda Sushmitha పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో “అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

  • సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
  • ఆ తర్వాత కొద్ది గంటలకే సుస్మిత పటేల్ “అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ పోస్ట్ చేశారు.
  • దీంతో పరకాల కాంగ్రెస్‌లో రేవూరి వర్సెస్ కొండా ఫ్యామిలీగా మారుతున్న రాజకీయ పోరుపై చర్చ మొదలైంది.
సీఎం రేవంత్ ప్రకటన.. ఆ తర్వాత సుస్మిత పోస్ట్

పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్ రెడ్డి కొనసాగుతున్నారు. గతంలో మంత్రి కొండా సురేఖ కూడా పరకాల నుంచి ప్రాతినిధ్యం వహించారు.

మంత్రి సొంతూరు వంచనగిరి కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె కొండా సుస్మిత పటేల్‌ను బరిలోకి దింపాలని కొండా దంపతులు భావిస్తున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది.

ఇటీవల పరకాల నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

దీంతో రేవూరి ప్రకాశ్ రెడ్డికి మరోసారి టికెట్ దాదాపు ఖరారైనట్టేననే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైంది.

ఈ నేపథ్యంలోనే సుస్మిత పటేల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

సీఎం రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాశ్ రెడ్డికి మద్దతుగా మాట్లాడిన కొద్ది గంటలకే ఆమె “అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ పోస్ట్ చేయడంతో.. సీఎం నిర్ణయానికి సుస్మిత పటేల్ సవాల్ విసిరినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సురేఖ జన్మదిన వేడుకలపై ఆసక్తి

మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పరకాల నియోజకవర్గంలో భారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు.

ముఖ్యంగా గీసుకొండ మండలంలోనూ పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్లు సమాచారం.

ఈ కార్యక్రమాల సందర్భంగా సుస్మిత పటేల్ రాజకీయంగా ఏదైనా కీలక ప్రకటన చేస్తారా? అనే ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.

ఒకవైపు రేవూరి ప్రకాశ్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించడం.. మరోవైపు పరకాల నుంచి పోటీకి సుస్మిత పటేల్ సిద్ధమవుతున్నారనే ప్రచారం రాజకీయ వేడిని మరింత పెంచింది.

ఎమ్మెల్యే రేవూరి ఏమన్నారు?

సుస్మిత పటేల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పందించారు.

సుస్మిత పటేల్ సోషల్ మీడియా ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

పీసీసీ చీఫ్ వేదికపై ఉండగానే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారని రేవూరి చెప్పారు.

నియోజకవర్గంలో ఉన్న కన్ఫ్యూషన్‌కు తెరదించేందుకు సీఎం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారని తెలిపారు.

సర్వేలు, అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకుని ముఖ్యమంత్రి తన పేరును ప్రకటించారని రేవూరి అన్నారు.

కాంగ్రెస్ శ్రేణులకు, నియోజకవర్గ నాయకులకు స్పష్టత ఇవ్వడం కోసమే సీఎం ఈ ప్రకటన చేశారని చెప్పారు.

ఎవరైనా గీత దాటితే అధిష్టానం చూసుకుంటుందని రేవూరి పేర్కొన్నారు. ఇలాంటి సోషల్ మీడియా ప్రచారాలను అధిష్టానం గమనిస్తుందని అన్నారు.

మంత్రి కొండా సురేఖ బర్త్ డే వేడుకల్లో జరిగే విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.

పరకాల నియోజకవర్గంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొండా ఫ్యామిలీ మధ్య పెరుగుతున్న రాజకీయ పోరు నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ వ్యవహారానికి ఎలా చెక్ పెడుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media