ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐటీ విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై జరుగుతున్న ప్రచారంపై ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
తాను డ్రగ్స్ తీసుకుంటానని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయంటూ తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో, లీకుల ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఒక డైలీ సీరియల్‌లా మార్చేశారని, ప్రతిరోజూ పనిగట్టుకుని లీకులు ఇస్తూ తన పరువు తీస్తున్నారని ఆరోపించారు. “పుట్టిన భూమి సాక్షిగా చెబుతున్నా.. నా జీవితంలో ఎప్పుడూ అక్రమ, అనైతిక పనులు చేయలేదు” అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ తప్పుడు ఆరోపణల వల్ల తన పరువు, ప్రతిష్టలకు కలిగిన నష్టానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యుడా లేక అధికారులా? అని ఆయన నిలదీశారు
