నాగార్జున సాగర్ నుంచి 90 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శ
చంద్రబాబు చెప్పు చేతల్లో ఉన్నావా? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి తరలింపునకు పాల్పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. తాగునీటి అవసరాల పేరుతో నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి 90 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం తీసుకెళ్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారని నిలదీశారు.
నాగార్జున సాగర్ నుంచి నీటి తరలింపుపై ప్రశ్నలు
నాగార్జున సాగర్ వద్ద 1600 మీటర్ల సొరంగం నిర్మాణం చేపడుతున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
చంద్రబాబు చెప్పు చేతల్లో ఉన్నారా? అని నిలదీశారు. ఒక ప్రాజెక్టు కింద ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మిగిలిందేమిటని ప్రశ్నించారు.
నల్లగొండ రైతులకు క్రాప్ హాలిడే పాటించాలని చెబుతూ, మరోవైపు ఏపీ రైతులకు నీళ్లు తీసుకెళ్లేందుకు ఎలా అనుమతిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల ప్రజలే కాంగ్రెస్ పార్టీని గెలిపించారని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు అదే జిల్లాల ప్రజలకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తెలంగాణ నీళ్లన్నీ ఏపీకి తరలిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు.
ఆదిత్యానాధ్ దాస్‌ను సలహాదారుగా ఎందుకు నియమించుకున్నారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే నీటిని తీసుకెళ్తోందని ఆరోపించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత అన్యాయం జరగలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి
ఏపీ ప్రభుత్వం చేస్తున్న నీటి తరలింపును ఎందుకు అడ్డుకోవడం లేదో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ప్రజలకు కూడా దీనిపై వివరణ ఇవ్వాలని అన్నారు. ఏపీ ప్రభుత్వంతో ఉన్న లాలూచీ ఏమిటని ప్రశ్నించారు.



