సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ?
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే అని చెప్పుకొనే కాంగ్రెస్ నాయకులు.. ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదో సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు ఎప్పుడూ నిజమైన ప్రేమ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల పోరాటం, రాజకీయ పరిస్థితుల కారణంగానే కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేసిందని స్పష్టంచేశారు.
తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియా ప్రతినిధులతో జరిగిన ఇష్టాగోష్టిలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలన, పెట్టుబడులు, ఉద్యోగాలు, సాగునీరు, తాగునీరు, రైతుల సమస్యలు, రాజకీయ కక్షసాధింపు సహా పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
తెలంగాణ చరిత్రను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూడటం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ మొదటి విలన్ అని విమర్శించారు. రాష్ట్ర సాధనలో ప్రజల త్యాగాలను, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమాన్ని ఎవరూ మరిచిపోలేరని చెప్పారు.
పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ నాయకులకు నిజంగా ప్రేమ ఉంటే ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంపై పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు పీవీపై ప్రేమ చూపిస్తున్న నాయకులకు వాణీదేవి గట్టి సమాధానం చెప్పారని అన్నారు. తెలంగాణ ప్రజలు, నాయకత్వంపై సోనియాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి నిజమైన అభిమానం లేదని విమర్శించారు.
తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ వెనుకబడుతున్నదని అన్నారు.
‘మూడేండ్ల తెలంగాణ నాట్ రైజింగ్.. తెలంగాణ ఫాలింగ్’ అని వ్యాఖ్యానించారు. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్నప్పుడు ఐటీ ఉద్యోగాలు ఎందుకు తగ్గుతున్నాయని ప్రశ్నించారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నదని అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ఐటీ ఉద్యోగాలు ఏడు వేలకుపైగా తగ్గినట్లు ప్రస్తావించారని గుర్తుచేశారు. 2026-27 బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఐటీ ఉద్యోగాలు తగ్గినట్లు చెప్పారని తెలిపారు.
పెట్టుబడులు వస్తేనే కొత్త కార్యాలయాలు, నివాస గృహాలకు డిమాండ్ పెరుగుతుందని వివరించారు. ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదని విమర్శించారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలోకి
22ఏ పేరుతో భూములను బ్లాక్ చేయడం, హైడ్రా పేరుతో సెలెక్టివ్ డెమాలిషన్లు చేపట్టడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటున్నదని కేటీఆర్ ఆరోపించారు.
బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రభుత్వం బెదిరిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ విధానాలు, అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారని అన్నారు.
దీని ప్రభావం నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల కుటుంబాలపై పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. నైట్‌ఫ్రాంక్ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు.
గాంధీ కుటుంబానికి బాడీగార్డుల్లా వ్యవహరిస్తున్నారు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రిగా కాకుండా గాంధీ కుటుంబానికి బాడీగార్డులా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వచ్చినప్పుడల్లా వారికి అంగరక్షకుడిలా ఉంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని గుర్తుచేశారు.
పార్టీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రాష్ట్ర గౌరవాన్ని తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీలోనూ ఇదే బానిస సంస్కృతి కొనసాగుతున్నదని విమర్శించారు. అమిత్ షా కాళ్లకు రామచందర్‌రావు మొక్కడమే కాకుండా ఆయన చెప్పులు మోయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.
పెట్టుబడులపై లెక్కలు చెప్పాలి
దావోస్, అమెరికా, యూరప్ పర్యటనల్లో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిలో ఎన్ని అమలయ్యాయో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఎన్ని కంపెనీలు తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేశాయి? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాయి? అనే వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు.
గత గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటించిన పెట్టుబడుల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం వెల్లడించలేదని విమర్శించారు. పాత పెట్టుబడులపై లెక్కలు చెప్పకుండా మళ్లీ కొత్త సమ్మిట్ నిర్వహించడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. అందుకే దానిని గ్లోబల్ సమ్మిట్ కాకుండా గోబెల్స్ సమ్మిట్ అని అభివర్ణించారు.
భారత్ సమ్మిట్‌తో ప్రజలకు ప్రయోజనం ఏదీ?
భారత్ సమ్మిట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించుకున్న రాజకీయ కార్యక్రమంగా మిగిలిపోయిందని విమర్శించారు.
ఈ కార్యక్రమం కోసం రూ.100 కోట్ల ప్రజాధనం ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్న సమయంలో ఆ మొత్తాన్ని రైతులకు సహాయంగా అందించినా, తాగునీటి అవసరాలకు వినియోగించినా ఉపయోగం ఉండేదని సూచించారు.
పథకాల పేర్లు మార్చితే ప్రజలకు లాభమా?
అన్నపూర్ణ క్యాంటీన్ పేరును ఇందిరమ్మ క్యాంటీన్‌గా మార్చినంత మాత్రాన ప్రజల జీవితాల్లో మార్పు రాదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్ వంటి విజయవంతమైన పథకాన్ని పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
ఇష్టం లేకపోతే దానికి ఇందిరమ్మ కిట్ అని పేరు పెట్టుకోవచ్చు కదా? అని అన్నారు. కాళేశ్వరం సహా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు ప్రాంతాలు, దేవుళ్ల పేర్లు పెట్టామని గుర్తుచేశారు.
లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ బ్యారేజీలు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, రాజరాజేశ్వరసాగర్ పేర్లను ప్రస్తావించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు, పథకాల పేర్లు మార్చితే.. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రాజెక్టుల పేర్లను మార్చే బాధ్యత తాను తీసుకుంటానని హెచ్చరించారు. అయితే నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టుల పేర్లపై తమకు అభ్యంతరం లేదని స్పష్టంచేశారు.
హైదరాబాద్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది
మూసీ ప్రాజెక్టు కోసం 10 టీఎంసీల నీటిని తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతున్నదని కేటీఆర్ అన్నారు. ఆ నీటిని హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తే మంచిదని సూచించారు.
నగరంలో ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని తెలిపారు. మంచినీటి సమస్య లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు.
ఒక అక్టోబర్ నెలలోనే 2.50 లక్షల వాటర్ ట్యాంకర్లకు బుకింగ్‌లు వచ్చాయని గుర్తుచేశారు. మూసీ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులను అడ్డుకున్నారని ఆరోపించారు.
ఇప్పటివరకు ప్రాజెక్టు డీపీఆర్ కూడా సిద్ధం కాలేదని అన్నారు. ‘ప్రాజెక్ట్ బిడ్ వితౌట్ ప్రాజెక్ట్ రిపోర్ట్’ అంటూ ప్రభుత్వ తీరును విమర్శించారు.
కాంట్రాక్టులపై 72 శాతం హామీ ఏమైంది?
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనుల్లో 72 శాతం వాటా ఇస్తామని హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు.
ఇందులో 42 శాతం బీసీలకు, 30 శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామని ప్రకటించిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మేఘా కృష్ణారెడ్డికి తప్ప ఇతరులకు కాంట్రాక్టులు దక్కుతున్నాయా? అని ప్రశ్నించారు.
ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లకు ఎన్ని పనులు కేటాయించారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కరువు రైతులకు వెంటనే సహాయం అందించాలి
రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు ప్రకటించలేదని కేటీఆర్ విమర్శించారు. 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినా రైతులకు సాయం అందడం లేదని అన్నారు.
కేంద్ర బృందాలను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసినప్పుడు కరువు సహాయక ప్యాకేజీ గురించి మాట్లాడారా? అని నిలదీశారు.
రైతులకు వెంటనే కరువు సహాయం అందించాలని కోరారు. పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న కాళేశ్వరం, కృష్ణా జలాలను సాగుకు వినియోగించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీలన్నీ మోసాలే
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు అభయహస్తం చూపించి, అధికారంలోకి వచ్చాక ప్రజలకు రిక్తహస్తం చూపించారని అన్నారు.
రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ మూడేండ్ల పాలనలో రాష్ట్రం సాధించింది శూన్యమని విమర్శించారు.
ఇప్పటికే నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను అమ్ముతూ, కుదువపెడుతూ రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మరో రెండేండ్లు ఈ ప్రభుత్వాన్ని ఎలా భరించాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు.
దీక్షా దివస్‌కు భారీ ఏర్పాట్లు
ఈ నెల 29న దీక్షా దివస్‌ను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. దీక్షా దివస్ స్ఫూర్తి సభల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కరీంనగర్ జిల్లా అలుగునూరులో 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేపట్టిన ప్రాంతంలోనే ప్రత్యేకంగా భారీ సభ నిర్వహిస్తామని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, కళాకారులు, ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తామని తెలిపారు. ఉద్యమ సమయంలో జరిగిన ఘటనలను, కేసీఆర్ పోరాటాన్ని మరోసారి గుర్తుచేసుకుంటామని చెప్పారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుస్తుంది
రాబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. అభ్యర్థుల ఎంపిక, పోటీ చేసే స్థానాలపై పార్టీ సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కేసీఆర్ ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
సోషల్ మీడియా పోస్టులపై కేసులు ఎందుకు?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను విమర్శించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు.
ఒక పోస్టును స్వయంగా పెట్టకుండా రీట్వీట్ చేసిన వ్యక్తిని 20 రోజులు జైలులో పెట్టడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. కాంగ్రెస్ సమ్మిట్‌లో రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారని గుర్తుచేశారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఆయన మాట్లాడాలని సూచించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుతో రాజకీయ డ్రామాలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా ఉపయోగించుకుంటున్నదని కేటీఆర్ ఆరోపించారు. మూడేండ్లుగా ఈ కేసు పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు మీడియా మేనేజ్‌మెంట్‌తో డైవర్షన్ డ్రామాలు చేస్తున్నారని అన్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో పూర్తి వివరాలు
బీఆర్‌ఎస్ హయాంలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని కేటీఆర్ తెలిపారు. ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు? ఎన్ని అనుమతులు తీసుకొచ్చారు? ఎన్ని బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మించారనే వివరాలను గణాంకాలతో ప్రజల ముందు ఉంచుతానని చెప్పారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడుస్తున్నా ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నదని ప్రశ్నించారు. ఈఎన్సీ, ఆదిత్యనాథ్‌దాస్ వ్యవహారాలపైనా వివరంగా మాట్లాడుతానని తెలిపారు.
నేతన్నలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ముఖ్యమంత్రి ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడాలని కేటీఆర్ సూచించారు.
సిరిసిల్ల పర్యటనలో నేతన్నల కోసం ప్రభుత్వం చేసిన పనులను వివరించాల్సి ఉండేదని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేశారని విమర్శించారు. చేనేత మిత్ర పథకాన్ని నిలిపివేశారని, నేతన్నకు బీమా పథకాన్ని కూడా కొనసాగించడం లేదని ఆరోపించారు.



