కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో పాత కక్షలు మళ్లీ పడగవిప్పాయి. భూ తగాదాల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో బోయ పరమేష్, బోయ వెంకటేష్ ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా వీరి మధ్య భూమి విషయంలో తగాదాలు నడుస్తున్నాయి. పాత కక్షలను మనసులో పెట్టుకున్న ప్రత్యర్థులు పక్కా పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతులు ఇద్దరూ గత ఏడాది (2025) ఫిబ్రవరి 24న జరిగిన ఒక హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్నట్లు సమాచారం. ఆ ఘటనకు ప్రతీకారంగానే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
