ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తిరుపతిలో జూన్ 9న నిర్వహించాలనుకున్న ‘సంక్షేమ’ బహిరంగ సభను వాయిదా వేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తొలి విజయోత్సవ సభను ‘సంక్షేమం’ పేరిట తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తొలి విజయోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
స్టీల్ ప్లాంట్ దుర్ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలువురు నేతలతో సంప్రదింపులు జరిపి సభను వాయిదా వేయాలని నిర్ణయించారు. తిరుపతి రూరల్ మండలం దామినేడులో భారీ బహిరంగ సభ నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితర కూటమి నేతలు హాజరుకావాల్సి ఉంది. అయితే జూన్ 12న సభను నిర్వహించనున్నారు.

