వడ్డీ లేని రుణాలపై సవాళ్ల పర్వం.. రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్

March 17, 2026 8:08 PM

హైదరాబాద్ (BNS): తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టగా, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు ఏకమై ప్రతిదాడికి దిగారు. చర్చా సందర్భంలో ఇరుపక్షాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

ఎగ్గొట్టు.. కూలగొట్టు.. చెడగొట్టు: కేటీఆర్ విమర్శల పర్వం
చర్చను ప్రారంభిస్తూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ చేసిన తొలి సంతకం ఫైల్ ఏమైందని ఆయన నిలదీశారు. ఆ ఫైలు ఎఫ్ఎస్ఎల్ (FSL) అగ్నిప్రమాదంలో కాలిపోయిందా లేక మాయమైందా అని ఎద్దేవా చేశారు. “ఈ ప్రభుత్వం తీరు ‘ఎగ్గొట్టు.. కూలగొట్టు.. చెడగొట్టు’ అన్నట్లుగా ఉంది. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడం, కట్టిన ప్రాజెక్టులను కూలగొట్టడం, ఉన్న పథకాలను చెడగొట్టడమే ఈ రెండేళ్ల పాలన” అని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి అంశాల్లో ప్రజలను వంచించారని కేటీఆర్ ఆరోపించారు.

అప్పుల గురించి మీరా మాట్లాడేది?: భట్టి, కోమటిరెడ్డి ఆగ్రహం
కేటీఆర్ వ్యాఖ్యలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, తాము ఆ అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. “మీలాగా మేము దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేయలేదు.. రైతు భరోసా, సన్నబియ్యం బోనస్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం” అని భట్టి వివరించారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. “రేషన్ కార్డులు ఇచ్చినందుకు, ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు, ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి” అని హితవు పలికారు.

రాజీనామా సవాల్‌తో సభలో రగడ
మహిళా సంఘాలకు రూ. 57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్న గవర్నర్ ప్రసంగంలోని అంశంపై సభలో సవాళ్ల పర్వం నడిచింది. ఇది పచ్చి అబద్ధమని, నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ.. ఇప్పటికే మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందాయని, లెక్కలు చూసుకునే ధైర్యం కేటీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ నేతలను మించిన వారు ప్రపంచంలోనే లేరని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై కూడా కేటీఆర్ మరియు స్పీకర్ మధ్య వాడివేడి చర్చ జరిగింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media