తన కోరికలు తీరిస్తే ఎగ్జామ్ పేపర్‌ను లీక్ చేస్తానంటూ ఓ విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడిన లక్నో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్సిటీలోని జువాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరమ్‌జీత్ సింగ్ విద్యార్థినితో ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ వైరల్ ఆడియోలో, బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆ విద్యార్థినితో అతడు.. “డార్లింగ్, నీ కోసం నేను పేపర్‌ను అరేంజ్ చేశాను. పరీక్షకు ముందే ఇక్కడికి రా.. ఇక్కడే నీకు ఆ పేపర్ ఇస్తాను” అని అనడం వినిపించింది. ఈ వ్యవహారంపై తీవ్ర మానసిక ఆవేదనకు గురైన సదరు విద్యార్థిని విషయాన్ని యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విద్యానంద్ త్రిపాఠి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో హసన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కీచక ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకుని వచ్చారు.
అయితే పరమ్‌జీత్ సింగ్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించాడు. యూనివర్సిటీలో జరుగుతున్న “అంతర్గత రాజకీయాల” కారణంగానే కావాలని తనను ఇరికిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ ఆడియో క్లిప్ బయటకు వచ్చిన వెంటనే యూనివర్సిటీ క్యాంపస్‌లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ – ABVP) నాయకులు ఆందోళనకు దిగారు. నిందితుడైన ప్రొఫెసర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
