3 ముఖ్యమైన విషయాలు
- స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోక్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
- ఇంటి లోపలి కాలుష్యం, బయట వాయుకాలుష్యం కూడా శ్వాసకోశ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
- శారీరక శ్రమ లేకపోవడం, పని చేసే చోట కాలుష్యానికి గురికావడం కూడా సమస్యలకు కారణం కావచ్చు.
ఊపిరితిత్తులు ఎందుకు ముఖ్యమంటే?
మన శరీరంలో ఊపిరితిత్తులు చాలా కీలకమైన పని చేస్తాయి. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్‌ను రక్తంలోకి చేరుస్తాయి. రక్తంలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటికి పంపుతాయి. శరీరంలో ఆమ్లాల స్థాయిని నియంత్రించడంలో కూడా సాయం చేస్తాయి.
అంతేకాదు. మనం పీల్చే గాలిలో ఉండే దుమ్ము, ఇతర వ్యర్థాలను వడకట్టడంలో ఊపిరితిత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. దగ్గు, తుమ్ము వంటి సహజ ప్రక్రియల ద్వారా శరీరాన్ని రక్షించడంలో కూడా సాయం చేస్తాయి.
అందుకే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. రోజువారీ అలవాట్లు, మన చుట్టూ ఉండే వాతావరణం శ్వాసకోశ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోక్
స్మోకింగ్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతుంది. సిగరెట్ పొగ శ్వాసనాళాల్లో వాపును పెంచుతుంది. శ్లేష్మం పేరుకుపోయేలా చేస్తుంది. ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తుంది.
దీంతో COPD, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యల ప్రమాదం పెరగవచ్చు.
సెకండ్ హ్యాండ్ స్మోక్ కూడా అంతే సమస్యగా మారవచ్చు. మనం స్మోకింగ్ చేయకపోయినా ఇతరులు వదిలే పొగను పీల్చడం వల్ల ప్రభావం పడుతుంది.
ఏం చేయాలి?
స్మోకింగ్, వేపింగ్‌కు దూరంగా ఉండాలి. ఇంట్లో, కారులో స్మోకింగ్ చేయకూడదు. పొగాకు అలవాటు మానేందుకు నిపుణుల సలహా తీసుకోవాలి.
ఇంటి లోపలి కాలుష్యాన్ని తగ్గించాలి
ఇంట్లో ఉండే గాలి కూడా పూర్తిగా శుభ్రంగా ఉంటుందని అనుకోవద్దు. దుమ్ము, బూజు, వంట సమయంలో వచ్చే పొగలు గాలిని కలుషితం చేస్తాయి.
పొగాకు పొగతో పాటు కొన్ని క్లీనింగ్ ఏజెంట్స్‌లో ఉండే కెమికల్స్ కూడా గాలిని ప్రభావితం చేయవచ్చు.
ఏం చేయాలి?
గదుల్లో గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. వంట చేసేటప్పుడు కిచెన్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించాలి. దుమ్ము, బూజును రెగ్యులర్‌గా శుభ్రం చేయాలి. పొగలు, ఏరోసోల్స్‌కు అవసరం లేకుండా ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తపడాలి.
కలుషిత గాలిని పీల్చడం కూడా సమస్యే
బయటి వాయుకాలుష్యం కూడా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా PM2.5 వంటి అత్యంత సూక్ష్మ కణాలు శ్వాసకోశ వ్యవస్థలోకి లోతుగా వెళ్లవచ్చు.
ఇవి శ్వాస మార్గాల్లో చికాకును పెంచుతాయి. పదేపదే కాలుష్యానికి గురైతే ఆస్తమా, ఇతర ఊపిరితిత్తుల సమస్యలు తీవ్రం కావచ్చు. ఊపిరితిత్తుల పనితీరు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
ఏం చేయాలి?
ఎక్కువసేపు బయట ఉండాల్సి వస్తే గాలి నాణ్యతను గమనించాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో బయట కష్టమైన వర్కౌట్స్ చేయకపోవడం మంచిది. దుమ్ము, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫేస్ మాస్క్ ఉపయోగించాలి. వీలైనంత వరకు ట్రాఫిక్ కాలుష్యానికి దూరంగా ఉండాలి.
శారీరక శ్రమ లేకపోవడం
ఎప్పుడూ కూర్చునే జీవనశైలి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శారీరక శ్రమ లేకపోతే కండరాలు బలహీనపడవచ్చు.
రెగ్యులర్ వర్కౌట్ చేయడం వల్ల శరీరం ఆక్సిజన్‌ను మరింత సమర్థంగా ఉపయోగించుకోవడానికి సాయం చేస్తుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడుతుంది.
ఏం చేయాలి?
వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయవచ్చు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా మధ్యలో లేచి నడవాలి.
ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు వ్యాయామం మొదలుపెట్టే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి.
పనిచేసే చోట కూడా జాగ్రత్త అవసరం
కన్‌స్ట్రక్షన్, కెమికల్స్, పొగలు వచ్చే ప్రాంతాల్లో పనిచేసేవారు కాలుష్యానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉండవచ్చు.
పనిచేసే చోట సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. భద్రతా చర్యలను తప్పకుండా పాటించాలి.
అలాగే శ్వాసకోశ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు
తరచూ దగ్గు రావడం, పిల్లికూతలు వినిపించడం, ఆయాసం రావడం వంటి లక్షణాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఛాతీలో ఇబ్బందిగా అనిపించడం, తరచూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా గమనించాల్సిన విషయాలే.
ఇలాంటి లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే వైద్యుల సూచనతో మెడికల్ టెస్టులు చేయించుకోవాలి.
ఊపిరితిత్తుల సమస్యలను ముందుగానే గుర్తించడం ముఖ్యం. రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేయడం ద్వారా శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులు:
డా.కె. యుగవీర్ గౌడ్
కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్


