చరిత్రలో తొలిసారిగా ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ముందు హాజరై, కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీరును తీవ్రంగా ఎండగట్టారు.

ఎన్నికల అధికారులు కింది స్థాయి సిబ్బందికి వాట్సాప్ ద్వారా అనధికారిక ఆదేశాలు జారీ చేస్తున్నారని, అందుకే ఇది ‘వాట్సాప్ కమిషన్’లా మారిందని మమత ఆరోపించారు. “కేవలం బెంగాల్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అస్సాం లేదా ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు ఈ హడావుడి లేదు?” అని ఆమె ప్రశ్నించారు. రెండేళ్లు పట్టే ప్రక్రియను కేవలం రెండు నెలల్లో పూర్తి చేయడం వెనుక కుట్ర ఉందని పేర్కొన్నారు. సుమారు 58 లక్షల మంది ఓటర్లను తొలగించారని, వివాహిత మహిళలు అత్తవారింటికి మారితే వారి ఓట్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారని కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశించినా ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా అంగీకరించడం లేదని, డొమిసిల్ సర్టిఫికేట్ వంటివి కూడా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. మమతా బెనర్జీ ఆవేదనను విన్న సీజేఐ, “ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఏ ఒక్క అమాయక పౌరుడి ఓటు హక్కు కోల్పోకుండా చూస్తాం” అని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఫిబ్రవరి 9 (సోమవారం) కు వాయిదా వేశారు.
