దాదాపు 24 గంటల పాటు ఆమె మెడకు ఇనుప గొలుసు ఉంచారు. ఆమెను ఇంటి లోపల ఒక స్తంభానికి కట్టి ఉంచేశారు. ఆమె భర్త ఎర్రగా కాలిన ఇనుప కడ్డీతో ఆమె శరీరాన్ని కాల్చాడు. అక్కడితో ఆగకుండా ఆమెను పదేపదే కొట్టాడు. పోలీసుల దగ్గరకు వెళ్లే ధైర్యం నీకు ఉందా అని సవాలు కూడా విసిరాడు. ఆ మహిళ మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి నిలబడింది. ఆమె తీవ్ర అలసటతో, గాయాలతో, పాదాలు చిట్లిపోయిన స్థితిలో ఉంది. పైగా ఆమెను బంధించడానికి ఉపయోగించిన గొలుసు అప్పటికీ ఆమె మెడకే వేలాడుతూ ఉంది.
బాధితురాలు మంగిబాయి తన్వర్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 10వ తేదీ సాయంత్రం ఆమె భర్త మద్యం సేవించి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ హింస మొదలైంది. రాత్రి భోజనం తర్వాత, అతను ఆమెను దూషించడం ప్రారంభించాడు. ఆమె అభ్యంతరం చెప్పడంతో, కర్రతో కొట్టాడు. ఆ హింసను భరించలేక, మంగిబాయి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకుని, రాత్రికి రాత్రే నిశ్శబ్దంగా ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆమె అత్తారింటి నుండి ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్ వైపు గంటల తరబడి నడిచింది. కానీ ఆమె అక్కడికి చేరుకోకముందే, ఆమె భర్త ఒక గుడి దగ్గర ఆమెను అడ్డగించి, మళ్లీ దాడి చేసి, బలవంతంగా తిరిగి గ్రామానికి తీసుకువెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చాక, మరింతగా శిక్షించడం మొదలు పెట్టాడు. భర్త తన మెడకు ఇనుప గొలుసు వేసి, ఒక స్తంభానికి కట్టేశాడని మంగిబాయి ఆరోపించారు.


