దేశంలోనే తొలి, ఏకైక గ్రామదేవతగా రికార్డు దిశగా మావుళ్లమ్మ
భీమవరం నడిబొడ్డున కొలువై ఉన్న శ్రీఅమ్మవారి దివ్యక్షేత్రం త్వరలో అరుదైన సువర్ణ ఘట్టానికి వేదిక కానుంది.
భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న మావుళ్లమ్మ తల్లిని సంపూర్ణ స్వర్ణమయం చేయాలని ఆలయ కమిటీ, ప్రజాప్రతినిధులు, భక్తులు సంకల్పించారు.
ఈ మహాకార్యం పూర్తయితే.. 100 కిలోల బంగారు ఆభరణాలు, ప్రత్యేకమైన స్వర్ణ చీరతో నిత్యం దర్శనమిచ్చే దేశంలోని తొలి, ఏకైక గ్రామదేవతగా శ్రీ మావుళ్లమ్మ తల్లి రికార్డు సృష్టించనున్నారు.
ఇప్పటికే 52 కిలోల స్వర్ణాభరణాలు
ప్రస్తుతం అమ్మవారిపై సుమారు 52 కిలోల స్వర్ణాభరణాలు ఉన్నాయి.
భక్తుల నుంచి సేకరించిన రూ.35 కోట్ల విలువైన 23.43 కిలోల బంగారాన్ని స్థానిక ఎమ్మెల్యే స్వర్ణమయం కమిటీకి అందజేశారు.
మిగిలిన 27 కిలోల బంగారం సేకరణ కోసం ప్రత్యేక విరాళాల కౌంటర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ లక్ష్యం పూర్తయితే అమ్మవారి అలంకరణలో మొత్తం 100 కిలోల బంగారం ఉండనుంది.
స్వర్ణ చీర.. కట్టుదిట్టమైన భద్రత
100 కేజీల బంగారం ఆలయంలో ఉండనున్న నేపథ్యంలో భద్రతను అత్యున్నత స్థాయికి పెంచుతున్నారు.
భద్రత కోసం గన్‌మెన్లను కేటాయించాలని కోరడంతో పాటు సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, ఫేషియల్ రికగ్నిషన్ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
శాకాంబరీ అలంకరణ ప్రత్యేక ఆకర్షణ
మావుళ్లమ్మ ఆలయంలో ఉత్సవాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని 6 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో శాకాంబరీ దేవిగా అలంకరించారు.
పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అలాగే అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు సమర్పించే ఆషాఢ సారె సంప్రదాయం ఇక్కడ ప్రత్యేకంగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది.



