కంటికి రెప్పలా పిల్లలను పెంచాడు.. పెళ్లిళ్లు చేశాడు.. ఆస్తులు ఇచ్చాడు.. చివరకు బుక్కెడు అన్నం పెట్టే నాథుడే కరువయ్యాడు. మెదక్ జిల్లాలో వృద్ధుడి కన్నీటి గాథ.
పిల్లల కోసం ఆస్తులన్నీ ఇచ్చాడు
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాపేట గ్రామానికి చెందిన ఎంబీ మహబూబ్ కథ ఇది.
ఒకప్పుడు ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లతో ఆయన ఇల్లు కళకళలాడేది.
తనకున్న కొద్దిపాటి ఆస్తితో పాటు గేదెలను అమ్మగా వచ్చిన డబ్బును కూడా పిల్లల కోసం ఖర్చు చేశాడు.
అందరికీ పెళ్లిళ్లు చేసి తన బాధ్యతను నెరవేర్చాడు.
ఒక ఇల్లు, మూడు ఎకరాల భూమిని కూడా సంపాదించి పిల్లలకు ఇచ్చాడు.
కానీ ఆరేళ్ల క్రితం భార్య చనిపోవడంతో మహబూబ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.
ఏడుగురు కొడుకులు హైదరాబాద్‌లో.. తండ్రికి మాత్రం అన్నం లేదు
మహబూబ్‌కు ఉన్న ఎనిమిది మంది కొడుకుల్లో ఏడుగురు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
పెద్ద కొడుకు మాత్రం గ్రామంలోనే ఉంటున్నాడు. అయినా గత ఏడాది కాలంగా మహబూబ్‌కు కనీసం అన్నం పెట్టే దిక్కు లేకుండా పోయింది.
ఆకలి తట్టుకోలేక ఎండా, వానా అనే తేడా లేకుండా గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్నాడు.
కూలిపోయిన తన పాత ఇంట్లో ఒక మూలన పడుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నాడు.
వయసు పైబడటంతో భిక్షాటన చేసే ఓపిక కూడా తగ్గిపోయింది. దీంతో తనకు అన్నం పెట్టాలని కొడుకులకు ఫోన్ చేసి వేడుకున్నాడు.
అయినా వారి నుంచి స్పందన రాలేదు.
మూడు రోజులు పోలీస్ స్టేషన్‌లోనే ఎదురుచూపులు
చేసేదేమీ లేక వారం రోజుల క్రితం మహబూబ్ పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు కొడుకులకు సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదు. కొడుకులు వస్తారేమో.. తనను ఇంటికి తీసుకెళ్తారేమో అనే ఆశతో మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు పోలీస్ స్టేషన్‌లోనే పడుకుని ఎదురుచూశాడు.
చివరకు పోలీసులు స్థానిక సర్పంచ్ అశోక్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన పోలీస్ స్టేషన్‌కు వచ్చి మహబూబ్‌ను గ్రామానికి తీసుకెళ్లారు.
ప్రజావాణిలో బోరున విలపించిన వృద్ధుడు
కొడుకులు రాకపోవడంతో సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు మహబూబ్ ఎంపీడీవో వెంకటలక్ష్మి వద్దకు వచ్చాడు.
అధికారుల ముందు కన్నీటిపర్యంతమైన ఆయన తన కొడుకులకు చెప్పి తనకు అన్నం పెట్టించాలని వేడుకున్నాడు.
“మేడం.. నాకు బుక్కెడు అన్నం పెట్టమని నా కొడుకులకు చెప్పండి” అంటూ బోరున ఏడ్చాడు. “నా భార్య బతికుంటే నాకు ఈ గతి పట్టేది కాదు” అంటూ భార్యను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఆయన పరిస్థితి చూసి ప్రజావాణికి వచ్చిన వారంతా కంటతడి పెట్టుకున్నారు. ఫిర్యాదు ఇచ్చిన అనంతరం కూడా ఏడుస్తూనే మహబూబ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.



