TG:మేడారంలో అసలైన జాతర గద్దెపైకి కొలువుదీరిన సారలమ్మ

January 29, 2026 1:08 PM

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’లో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. బుధవారం రాత్రి భక్తిశ్రద్ధల మధ్య శ్రీ సారలమ్మ అమ్మవారు కన్నెపల్లి నుంచి బయలుదేరి మేడారం గద్దెపై కొలువుదీరారు.

కన్నెపల్లిలోని ఆలయంలో పూజారులు సుమారు రెండు గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, సాయంత్రం 7 గంటలకు సారలమ్మ అమ్మవారిని గద్దెల వైపు తీసుకువచ్చారు.ఈ వేడుకలో రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. వీరు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆదివాసీ గిరిజన సంప్రదాయ నృత్యాల్లో పాల్గొని భక్తుల్లో ఉత్సాహం నింపారు.
కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజులు కూడా మేడారం చేరుకున్నారు. జంపన్న వాగు మీదుగా వచ్చిన సారలమ్మకు భక్తులు దారిపొడవునా నీరాజనాలు పలికారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సారలమ్మ అమ్మవారు గద్దెపైకి చేరుకున్నారు. ప్రధాన పూజారి కాక సారయ్య నేతృత్వంలో అమ్మవారిని ప్రతిష్టించడంతో తొలిరోజు వేడుకలు విజయవంతంగా ముగిశాయి.ప్రస్తుతం సారలమ్మ గద్దెపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుండటంతో మేడారం పరిసరాలు ‘గోవిందా.. గోవిందా’ నామస్మరణతో మారుమోగుతున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media