ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. జాతరలో ప్రధాన ఘట్టమైన అమ్మవార్ల రాకకు ముందు, శనివారం గంగారం మండలం పూనుగొండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు లక్మీపురం చేరుకున్నారు.
శుక్రవారం రాత్రి లక్మీపురం చేరుకున్న పగిడిద్దరాజుకు భక్తులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పెనుక వంశీయులు ఏర్పాటు చేసిన విడిది ఇంట్లో రాజు రాత్రి బస చేశారు.శనివారం ఉదయం లక్మీపురం నుంచి మేడారం వైపు పగిడిద్దరాజు శోభయాత్ర ప్రారంభమైంది. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య అట్టహాసంగా సాగుతున్న ఈ యాత్రలో భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ రాత్రి వరకు పగిడిద్దరాజు మేడారం గడ్డపై అడుగుపెట్టనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ములుగు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభయాత్ర సాఫీగా సాగేలా పర్యవేక్షిస్తున్నారు.
