ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం ‘సమ్మక్క-సారలమ్మ’ మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం అపూర్వ ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈసారి టీటీడీ (TTD) తరహాలో అత్యాధునిక క్యూలైన్ల వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. రూ. 3 కోట్లతో సుమారు 750 మీటర్ల మేర ఐదు వరుసల క్యూలైన్లను నిర్మిస్తున్నారు. దీనివల్ల భక్తులకు కేవలం 10 నుండి 20 నిమిషాల్లోనే దర్శనం పూర్తయ్యే అవకాశం ఉంది.
ఎండ తగలకుండా షెడ్లు, సేదతీరడానికి ఫ్యాన్లు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. క్యూలైన్ల మధ్యలో వాలంటీర్లు, పోలీసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక వరుసను కేటాయించారు. గతంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ, ప్రముఖుల దర్శనం కోసం ఈసారి ప్రత్యేకంగా ‘వీఐపీ వరుస’ను మాస్టర్ ప్లాన్లో పక్కాగా రూపొందించారు. గద్దెల ప్రాంగణానికి కుడి వైపున స్మృతివనాన్ని నిర్మిస్తూ, పరిసరాలను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్లనున్నారు. జాతర కోసం కేటాయించిన రూ. 251 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, పనులు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు.
