పండగ సీజన్ డిమాండ్‌కు సిద్ధమవుతున్న మీషో
విక్రేతల వద్ద 6.5 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: రాబోయే పండగ సీజన్లో పెరగనున్న ఆన్లైన్ కొనుగోళ్ల డిమాండ్‌ను అందుకునేందుకు ఈ-కామర్స్ సంస్థ Meesho భారీగా సీజనల్ ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురానుంది. తన విక్రేతలు, లాజిస్టిక్స్ నెట్వర్క్ ద్వారా 10 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది.
వీటిలో సుమారు 6.5 లక్షల ఉద్యోగాలు విక్రేతల నెట్‌వర్క్‌లో, మరో 3.75 లక్షల ఉద్యోగాలు లాజిస్టిక్స్ కార్యకలాపాల్లో ఏర్పడనున్నాయి.
ప్యాకేజింగ్ నుంచి ఇన్వెంటరీ నిర్వహణ వరకు
పండగ సీజన్లో పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా వ్యాపారాలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయని మీషో తెలిపింది.
సుమారు 1.3 లక్షల మంది విక్రేతలు సీజనల్ సిబ్బందిని నియమించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ప్యాకేజింగ్, తయారీ, ఉత్పత్తి, గిడ్డంగుల నిర్వహణ, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయని వివరించింది.
కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం, స్టాక్ పెంచుకోవడం, పండగ సేకరణలను విస్తరించుకోవడం కోసం విక్రేతలు ఈ సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపింది.
లాజిస్టిక్స్‌లోనూ భారీగా అవకాశాలు
Meesho కు చెందిన లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్ Valmo, అలాగే థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3PL) భాగస్వాములు తమ సామర్థ్యాన్ని పెంచుకోనున్నారు.
ఈ విభాగంలో డెలివరీ, సార్టేషన్, డెలివరీ సెంటర్ కార్యకలాపాలు, సూపర్వైజరీ బాధ్యతల్లో సీజనల్ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
పండగ సీజన్ తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాన్ని విక్రేతలు, లాజిస్టిక్స్ భాగస్వాములకు కల్పించడంతో పాటు దేశవ్యాప్తంగా ఉద్యోగాలను సృష్టిస్తోందని మీషో తెలిపింది.
భారత్‌లోని ప్రధాన ఈ-కామర్స్ సంస్థలు తమ వార్షిక పండగ సేల్స్‌కు సిద్ధమవుతున్న సమయంలో మీషో ఈ ప్రకటన చేసింది. సాధారణంగా ఈ పండగ సేల్స్ ఏడాది మొత్తం జరిగే ఆన్లైన్ విక్రయాల్లో గణనీయమైన వాటాను కలిగి ఉంటాయి.



