ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు విద్యార్థుల భవిష్యత్తుకు శాపంగా మారాయి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన మండలాల పాఠశాలల వివరాలు పోర్టల్‌లో కనిపించకపోవడంతో విద్యార్థులు ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోతున్నారు.
మండపేట నియోజకవర్గ పరిధిలోని మండపేట (టౌన్ & రూరల్), కపిలేశ్వరపురం, రాయవరం మండలాలు ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో విలీనమయ్యాయి. అయితే, ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈ మండలాల పాఠశాలలు, విద్యార్థుల పేర్లు అప్‌డేట్ కాలేదు. విద్యా హక్కు చట్టం (RTE 2009) ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ఉచిత విద్య కోసం దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం లేకుండా పోయింది. ప్రైవేట్ విద్యాసంస్థల పేర్లు ఆన్‌లైన్‌లో రాకపోవడంతో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. జిల్లా ఉచిత విద్య విద్యార్థుల తల్లిదండ్రుల సంక్షేమ సంఘం నాయకులు కె.కె. సత్తిబాబు, ఎ. సుధీర్ సోమవారం కలెక్టరేట్‌లో వినతి పత్రం అందజేశారు. ఆన్‌లైన్ సమస్య తీరేవరకు మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించాలని కోరారు. రాజమండ్రి అర్బన్ పరిధిలో కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలలు కూడా పోర్టల్‌లో దర్శనమివ్వడం లేదని సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి విలీన మండలాల డేటాను పోర్టల్‌లో చేర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
