టీనేజర్ల కోసం కొత్త నిబంధనలు.. రోజుకు 2 గంటల పరిమితి
సోషల్ మీడియా దిగ్గజం Meta కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించడంతో పాటు, యాప్‌లను వ్యసనంగా మార్చే ఫీచర్లపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అంగీకరించింది.
అమెరికాలో నమోదైన కేసులను పరిష్కరించేందుకు దాదాపు 48 రాష్ట్రాలు, District of Columbia, ఇతర అమెరికా ప్రాంతాలతో Meta ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం Meta 17.1 బిలియన్ డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది
అయితే ఈ సెటిల్‌మెంట్ అమలులోకి రావాలంటే కోర్టు తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది.
రోజుకు రెండు గంటలే
ఈ ఒప్పందంలో భాగంగా Instagram, Facebook వినియోగించే 18 ఏళ్లలోపు వారికి కొత్త నిబంధనలు రానున్నాయి.
రెండు ప్లాట్‌ఫారమ్‌లను కలిపి రోజుకు గరిష్ఠంగా రెండు గంటలు మాత్రమే ఉపయోగించుకునేలా పరిమితి విధించనున్నారు.
ఈ పరిమితిని దాటాలంటే తల్లిదండ్రుల అనుమతి అవసరం. అంతేకాదు.. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టీనేజర్లు Instagram, Facebookలో ఫీడ్, స్టోరీస్, ఎక్స్‌ప్లోర్, రీల్స్ వంటి ఫీచర్లను యాక్సెస్ చేయలేరు.
స్కూల్ టైమ్‌లో నోటిఫికేషన్లు మ్యూట్
పాఠశాల సమయాల్లో కూడా Instagram, Facebook వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
వారం రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పుష్ నోటిఫికేషన్లు డిఫాల్ట్‌గా మ్యూట్ అవుతాయి.
అయితే Direct Messages, అకౌంట్ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అలర్ట్లు మాత్రం వినియోగదారులకు అందుతాయి.
15 నిమిషాలకోసారి రిమైండర్
టీనేజర్లు ఎక్కువసేపు నిరంతరంగా స్క్రోల్ చేయకుండా ఉండేందుకు Meta ‘Productive Pauses’ పేరుతో కొత్త రిమైండర్లను తీసుకురానుంది.
15 నిమిషాల పాటు నిరంతరంగా యాప్‌ను ఉపయోగించిన తర్వాత ఒక రిమైండర్ కనిపిస్తుంది.
రోజువారీ వినియోగం 60 నిమిషాలు, 90 నిమిషాలకు చేరుకున్నప్పుడు కూడా రిమైండర్లు చూపిస్తారు.
వయస్సు నిర్ధారణ మరింత కఠినం
18 ఏళ్లలోపు వినియోగదారులను గుర్తించేందుకు Meta మరింత బలమైన Age Assurance విధానాలను అమలు చేయనుంది.
పిల్లలకు అనుచితమైన కంటెంట్, సైబర్ బుల్లీయింగ్, ఈటింగ్ డిజార్డర్స్, ఆత్మహత్య, స్వీయహానిని ప్రోత్సహించే కంటెంట్ నుంచి రక్షణ కల్పించేలా భద్రతా నియంత్రణలను కూడా కఠినతరం చేయనుంది.
పిల్లలు చేసే పోస్టులపై కనిపించే లైక్స్, రియాక్షన్ కౌంట్లు వంటి కొన్ని ఫీచర్లను కూడా పరిమితం చేయనుంది.
YouTube, TikTok, Snapchatకు Meta పిలుపు
ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి నియంత్రణలు లేకపోతే పిల్లలు ఒక యాప్ నుంచి మరో యాప్‌కు మారే అవకాశం ఉందని Meta చెబుతోంది.
అందుకే YouTube, TikTok, Snapchat వంటి ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇలాంటి భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని Meta కోరింది.
ఈ సంస్థలు అంగీకరిస్తే సెటిల్‌మెంట్‌లో అదనపు మొత్తంతో పాటు మరింత కఠినమైన వినియోగ పరిమితులు అమల్లోకి వచ్చేలా ఒప్పందంలో నిబంధనలు ఉన్నాయి.
Meta తప్పు ఒప్పుకుందా?
ఈ సెటిల్‌మెంట్‌లో Meta ఎలాంటి తప్పును లేదా చట్టపరమైన బాధ్యతను అంగీకరించలేదు.
అయితే పిల్లల భద్రత కోసం తమ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ మార్పులు చేసేందుకు అంగీకరించింది.
ఈ కేసుకు సంబంధించి Meta సుమారు 10 బిలియన్ డాలర్ల చార్జ్‌ను ప్రస్తుత త్రైమాసికంలో నమోదు చేయనున్నట్లు వెల్లడించింది.
భారత్‌పై ప్రభావం ఉంటుందా?
ప్రస్తుతం ఇది అమెరికాలో కుదిరిన సెటిల్‌మెంట్ కావడంతో భారత్‌లో ఇదే నిబంధనలు నేరుగా అమల్లోకి రావు.
అయితే పిల్లల ఆన్‌లైన్ భద్రత, వయస్సు నిర్ధారణ, తల్లిదండ్రుల నియంత్రణలు, స్క్రీన్ టైమ్ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా Instagram, Facebook వంటి ప్లాట్‌ఫారమ్‌లు భారత మార్కెట్లో టీనేజర్ల కోసం భవిష్యత్తులో ఇలాంటి ఫీచర్లను తీసుకువస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఈ ఒప్పందం కోర్టు తుది ఆమోదానికి లోబడి ఉంది. కోర్టు ఆమోదం లభించిన తర్వాతే కొత్త నిబంధనల అమలు ప్రారంభమవుతుంది.



