గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని శాఖలు అస్తవ్యస్తంగా మారాయని, ముఖ్యంగా పశుసంవర్ధక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళవారం శాసనసభలో పశువైద్యశాలల్లో సౌకర్యాల కొరతపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
రాష్ట్రంలో 3,176 పశువైద్య కేంద్రాలు ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మందులు, ఆధునిక పరికరాలు, సిబ్బంది లేక అవి ఉత్సవ విగ్రహాలుగా మారాయని విమర్శించారు. రైతుల విరాళాలతో కట్టిన పాత భవనాలను కూడా పట్టించుకోకుండా శిథిలావస్థకు నెట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 485 కొత్త భవనాలను నిర్మించామని.. మరో 400 కొత్త భవనాల కోసం రూ. 265.10 కోట్లు, మరమ్మతుల కోసం రూ. 37.40 కోట్లు అవసరమని గుర్తించినట్లు తెలిపారు. 2026-27 నుండి 2028-29 మధ్య నాబార్డ్ (RIDF-NABARD) నిధులతో దశలవారీగా పశువైద్యశాలల భవన నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.వైసీపీ హయాంలో శాఖలను మూసివేస్తే.. తమ ప్రభుత్వం రైతులకు, పశుపాలకులకు అండగా ఉంటూ పశుసంవర్ధక శాఖకు పూర్వవైభవం తీసుకువస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
