భారతదేశాన్ని $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ విజన్‌ను నెరవేర్చడానికి ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు అవసరమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలో సీఐఐ–విట్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన *హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్–2025 లో ఆయన పాల్గొన్నారు.
లోకేష్ మాట్లాడుతూ, “దేశం త్వరలోనే $5 ట్రిలియన్ ఎకానమీని చేరుకుంటుంది. కానీ మన లక్ష్యం $30 ట్రిలియన్ ఎకానమీ కావాలి. దానికి ఉన్నత విద్యా రంగం మూలస్థంభం కావాలి” అన్నారు. గత 17 నెలల్లో ఏపీకి $120 బిలియన్ పెట్టుబడులు వచ్చాయని, రాబోయే పెట్టుబడుల సదస్సులో మరో $120 బిలియన్ పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. 2029 నాటికి ట్రిలియన్ డాలర్ పెట్టుబడులు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
యువత డిగ్రీలతోపాటు నైపుణ్యాలపై దృష్టిసారించాలని సూచిస్తూ, రాష్ట్రంలో “స్కిల్ సెన్సస్” ద్వారా ప్రతి పౌరుడి నైపుణ్యాన్ని అంచనా వేస్తున్నామని చెప్పారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వర్క్‌ఫోర్స్ తయారు చేయడమే లక్ష్యమన్నారు.

భారత యువ జనాభాలో 54% మంది 25 సంవత్సరాల లోపు వయస్సు వారేనని గుర్తుచేసిన లోకేష్, “విద్యా సంస్కరణల ద్వారానే మన యువశక్తి నిజమైన డెమోగ్రాఫిక్ డివిడెండ్ అవుతుంది” అన్నారు.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను $2.4 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ దిశగా ఉన్నత విద్యను“నాలెడ్జ్ & ఇన్నోవేషన్ హబ్”గా మార్చేందుకు ఐదు రంగాల్లో మార్పులు అవసరమని పేర్కొన్నారు — కరిక్యులమ్ టు కెరీర్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, డిజిటల్ నైపుణ్యాలు, అంతర్జాతీయీకరణ, ప్రాంతీయ సమతుల్యత.
కాంక్లేవ్‌లో సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ అశ్విన్ మహాలింగం, విట్ వైస్ ప్రెసిడెంట్ డా. జీవీ సెల్వం, ఏపీ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ కె. రత్నశీలామణి తదితరులు పాల్గొన్నారు.


