మంగళగిరి(BNS): రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పమే మన ఏకైక లక్ష్యం కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. మంగళగిరి సమీపం చినకాకానిలోని మయూరి టెక్ పార్క్ భవనం ఐదో అంతస్తులో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు(APEDB) నూతన కార్యాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా టెక్ పార్క్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యాలయం మొత్తం కలియతిరిగారు. ఈ సందర్భంగా ఏపీఈడీబీ ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తూ.. గత ప్రభుత్వం ఏపీఈడీబీని నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ఏకైక లక్ష్యం కావాలి. ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలి. యువగళం పాదయాత్ర సమయంలో యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాను. జీడీ నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న సమయంలో రోడ్డు పక్కన బజ్జీలు విక్రయించే మోహన అనే మహిళను కలిశాను. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం వద్దని, తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే చాలని ఆమె చెప్పారు. కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే పెద్దఎత్తున పెట్టుబడులు సాధించాం. దేశానికి వచ్చిన వంద రూపాయల పెట్టుబడుల్లో 25 రూపాయాలు ఏపీకి వచ్చాయి. ఇందుకు ఈడీబీ బృందానికి అభినందనలు. సీఈవో సాయికాంత్ వర్మకు నా హృదయపూర్వక అభినందనలు.
