రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన, పలు కీలక నిర్మాణాలను పరిశీలించి కాంట్రాక్ట్ సంస్థలకు దిశానిర్దేశం చేశారు.

సీడ్ యాక్సిస్ రోడ్డును పాత హైవేతో కలిపే స్టీల్ బ్రిడ్జి, అలాగే గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి తనిఖీ చేశారు. ఈ బ్రిడ్జిలు రాజధాని అనుసంధానానికి అత్యంత కీలకమని, వీటిని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, ఇప్పటికే ఒకవైపు వాహనాల రాకపోకలకు అనుమతి లభించిందని తెలిపారు. రెండో వైపు పనులు కూడా త్వరగా పూర్తి చేస్తే గుంటూరు, విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు నేరుగా రాజధానిలోకి ప్రవేశించే వీలుంటుందన్నారు. నిర్మాణాల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ, నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ పర్యటనలో సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు మరియు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
