తెలంగాణ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం కూకట్‌పల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి (Integrated Sub-Registrar Office) ఆయన శంకుస్థాపన చేశారు. మొదటి దశలో ORR పరిధిలో, రెండో దశలో జిల్లా కేంద్రాల్లో, మూడో దశలో నియోజకవర్గాల్లో ఈ భవనాలను నిర్మిస్తారు.

ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా బిల్డర్ల భాగస్వామ్యంతో ఈ 12 క్లస్టర్ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ భవనాల 5 ఏళ్ల నిర్వహణ బాధ్యత కూడా నిర్మాణ సంస్థలదే. కొత్త జంటలకు, చిన్న పిల్లల తల్లులకు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా వెయిటింగ్ హాల్స్, ఫీడింగ్ రూమ్స్ వంటి సకల సౌకర్యాలు ఈ సమీకృత భవనాల్లో ఉంటాయి.

పేదల భూములు, అసైన్డ్ మరియు ప్రభుత్వ భూములను కాపాడే విషయంలో అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు. గచ్చిబౌలిలోని మొదటి సమీకృత భవనం జూన్ నాటికి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
