ఏపీ శాసనసభలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తనదైన ముద్ర వేశారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో అనంతపురం సర్వజనాసుపత్రి అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమగ్రమైన సమాధానాలిచ్చారు. మంత్రి సన్నద్ధతను చూసి సభాధ్యక్ష స్థానంలో ఉన్న శ్రీ రఘురామ కృష్ణంరాజు “మంత్రి గారు బాగా హోంవర్క్ చేశారు” అంటూ ప్రశంసించారు.
అనంతపురం ఆసుపత్రిలో పడకల సంఖ్యను 560 నుండి 1348కి పెంచినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం మధ్యలో వదిలేసిన MCH బ్లాక్ నిర్మాణాన్ని 5 అంతస్తుల వరకు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం రూ.1000 కోట్ల బకాయిలు పెట్టడం వల్ల సరఫరాలో ఇబ్బందులు వచ్చాయని, కూటమి ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించి వ్యవస్థను గాడిన పెట్టిందని స్పష్టం చేశారు.స్థానిక ఆసుపత్రుల అవసరాల కోసం 20% నిధులతో నేరుగా మందులు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించామన్నారు. ఆసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది హాజరు కోసం ‘ఫేషియల్ రికగ్నిషన్’ (FRS) విధానాన్ని అమలు చేస్తున్నామని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
