ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 94,689 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెనాలిలోని కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్ నందు బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కలిసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
గత ఏడాది జూలై నుండి నవంబర్ వరకు నిర్వహించిన కంటి పరీక్షల్లో దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించిన 94,689 మంది విద్యార్థులకు ఈ అద్దాలను అందజేస్తున్నారు.ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు రూ. 2.52 కోట్లను వెచ్చిస్తోంది.చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా చూడటమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేల పర్యవేక్షణలో అర్హులైన విద్యార్థులందరికీ దశలవారీగా అద్దాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు.
