సైబరాబాద్‌లో మైనర్ బాలికను అపహరించి ఆరు నెలల పాటు నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ విషయాన్ని సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, దుండిగల్‌కు చెందిన షేక్ నసీర్ అలియాస్ అహ్మద్ 2021 అక్టోబర్ 29న ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను బెదిరించి అపహరించాడు. అనంతరం ఆమెను ముంబైకు తీసుకెళ్లి సుమారు ఆరు నెలల పాటు ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.ఈ కేసులో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి పోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానాలు విధించింది. అలాగే బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
