కజియా లిజ్ మెజోకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం
కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటం సొంతం చేసుకుంది.
జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా పోటీపడిన 52 మంది ఫైనలిస్టులను వెనక్కి నెట్టి టైటిల్ దక్కించుకుంది.
మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత మానికా విశ్వకర్మ కజియాకు కిరీటం అలంకరించారు.
దీంతో నవంబర్‌లో ప్యూర్టోరికోలో జరిగే 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరఫున కజియా ప్రాతినిధ్యం వహించనుంది.
మూడేళ్లుగా కిరీటం కోసం కష్టం
విజయం తర్వాత కజియా లిజ్ మెజో ఆనందం వ్యక్తం చేసింది.
ఈ కిరీటం కోసం మూడేళ్లకు పైగా కష్టపడ్డానని తెలిపింది. తన సొంత రాష్ట్రం కేరళకు ఈ విజయాన్ని తీసుకెళ్లడం ఎంతో గర్వంగా ఉందని చెప్పింది.
19 ఏళ్ల వయసులో ఇంత పెద్ద వేదికపై నిలవడానికి ఎంతో ధైర్యం అవసరమైందని కజియా పేర్కొంది.
తనపై తనకు నమ్మకం పెంచుకోవడమే అతిపెద్ద సవాలుగా భావించానని తెలిపింది.
భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం తేవడమే లక్ష్యం
భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం తీసుకురావడమే తన తొలి లక్ష్యమని కజియా చెప్పింది.
తాను చేసే ప్రతి పనిలో భారత్, కేరళకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నట్లు తెలిపింది.
విజేతను ఎంపిక చేసిన జడ్జింగ్ ప్యానెల్‌లో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, ఉర్వశి రౌతేలా, రియా సింఘా, పర్యావరణవేత్త ప్రగ్యా కపూర్ ఉన్నారు. సెలీనా జైట్లీ కూడా జడ్జిగా వ్యవహరించారు.
వైష్ణవి గణేశ్ తొలి రన్నరప్
వైష్ణవి గణేశ్ తొలి రన్నరప్‌గా నిలిచింది. ఆమెకు మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2026 టైటిల్ దక్కింది.
అనుశ్రీ సాతవ్లేకర్ రెండో రన్నరప్‌గా నిలిచింది. తేజస్విని శ్రీవాస్తవ మూడో రన్నరప్‌గా, అనుభా వశిష్ఠ్ చౌదరి నాలుగో రన్నరప్‌గా నిలిచారు.



