ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే ఉందని ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన వ్యవస్థలు ఇప్పుడు మళ్ళీ గాడిలో పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన స్పందన పొందుతూ ‘సూపర్ హిట్’ అయ్యాయని రామచంద్రయ్య తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు 24 గంటలు శ్రమిస్తున్నారని, ఆయన అనుభవం ఏపీకి ఇప్పుడు ఎంతో అవసరమని కొనియాడారు.
జగన్ తన పార్టీని రౌడీలతో నడుపుతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ‘అప్పుల ఆంధ్రప్రదేశ్’గా మారిందని మండిపడ్డారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకుని కూటమికి అధికారం ఇచ్చారని, తానూ రెండేళ్ల ముందే భవిష్యత్తును ఊహించి టీడీపీలో చేరానని గుర్తు చేశారు.రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ఒక ‘గేమ్ చేంజర్’లా పనిచేస్తున్నారని రామచంద్రయ్య ధీమా వ్యక్తం చేశారు.
