సాంకేతిక ను విజయానికి వాడుకోండి: ప్రధాని మోదీ

February 9, 2026 6:46 PM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 09 (బీఎన్ఎస్): విద్యార్థులు సాంకేతికతను తమ పనులను సులభతరం చేసుకునే సాధనంగా వాడుకోవాలి తప్ప, దానికి బానిసలుగా మారకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. సోమవారం ఉదయం జరిగిన ‘పరీక్ష పే చర్చ – 2026’ తొమ్మిదో ఎడిషన్ రెండో సెషన్‌లో ఆయన దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో నేరుగా ముచ్చటించారు. పరీక్షల ఒత్తిడిని జయించడం, కెరీర్ ఎదుగుదల మరియు ఆధునిక సవాళ్లపై ఆయన తనదైన శైలిలో మార్గనిర్దేశం చేశారు.

టెక్నాలజీతో స్నేహం చేయండి.. బానిసత్వం వద్దు! “మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు యువత బానిసలవుతున్నారనే వార్తలు వింటున్నాను. సాంకేతికత అనేది ఒక అద్భుతమైన ఉపాధ్యాయుడి వంటిది. దానిని నేర్చుకోవడానికి, ఎదగడానికి ఉపయోగించండి” అని మోదీ సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాలు వద్దని, ఏఐని సరిగ్గా వాడుకోవడం నేర్చుకుంటే అది మానవ పనితీరును మెరుగుపరుస్తుందే తప్ప ఉపాధిని దెబ్బతీయదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

క్రమశిక్షణే విజయానికి మూలం క్రమశిక్షణ మరియు ప్రేరణ మధ్య ఏది ముఖ్యం అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. “ఎంత స్ఫూర్తి పొందినా, ఆచరణలో క్రమశిక్షణ లేకపోతే ఫలితం ఉండదు. సమయపాలన, నిలకడ మరియు స్వీయ క్రమశిక్షణే మనం పొందిన ప్రేరణను విజయంగా మారుస్తాయి” అని స్పష్టం చేశారు. కేవలం చదువులోనే కాకుండా, క్రీడలు మరియు కళల్లో కూడా విద్యార్థులు రాణించాలని, అవి ఒత్తిడిని తగ్గించే ఔషధాలని పేర్కొన్నారు.

లీడర్‌గా ఎదగాలంటే.. నాయకత్వ లక్షణాలపై మాట్లాడుతూ.. “నాయకత్వం అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం కాదు. మీ ఆలోచనలను పది మందికి స్పష్టంగా చెప్పగలగడమే నిజమైన నాయకత్వం. ఒక మంచి లీడర్ ఎప్పుడూ తన బాధ్యతలకు భయపడడు, నిబద్ధతతో పనిచేస్తాడు” అని అన్నారు. అలాగే, విద్యార్థులు తమ సొంత ప్రాంతాలను, జిల్లాను సందర్శించి అక్కడి విశిష్టతలను అర్థం చేసుకోవాలని, పర్యాటకం ఒక గొప్ప పాఠమని సూచించారు.

ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి పరీక్షల సమయంలో మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్ర చాలా అవసరమని మోదీ గుర్తుచేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చి ఒత్తిడికి గురిచేయవద్దని, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కోరారు. పరీక్షలను ఒక భయానక అడ్డంకిలా కాకుండా, జీవితంలో ఒక ‘ఉత్సవం’లా భావించి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media