మామిడికుదురు గ్రామంలోని ఆల్ క్యాస్ట్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 12 కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) నాయకులు స్పందించి బాధితులను ఆదుకోవడం అభినందనీయమని ఎంపీ అన్నారు. బాధిత కుటుంబాలన్నీ ఒకే చోట ఉండాలని కోరుతున్నందున, అందుబాటులో ఉన్న అదనపు భూమిని వారికి కేటాయించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ప్రస్తుతం బాధితులు పాఠశాల భవనంలో ఉంటున్నారని, వారికి వారం రోజుల్లోనే తాత్కాలిక షెల్టర్లు నిర్మించే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం బాధ్యతగా బాధితులకు భోజనం, బట్టలు, నిత్యావసర వస్తువులను అందిస్తోందని తెలిపారు. ఎంపీ స్వయంగా బాధితులకు దుప్పట్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
