ఆధ్యాత్మికతకు నిలయమైన నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం రాజకీయ రచ్చకు వేదికైంది. స్వామివారి బ్రహ్మోత్సవాల కళ్యాణ వేడుకలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఇది కాస్తా పరస్పరం పట్టువస్త్రాలు లాక్కునే స్థాయికి చేరడం సంచలనంగా మారింది.
కళ్యాణం సందర్భంగా ఆలయ పండితులు ఎంపీ కేశినేని చిన్నికి పట్టువస్త్రాలు, ఎమ్మెల్యే కొలికలపూడికి ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ప్రోటోకాల్ ప్రకారం పట్టువస్త్రాలు తనకే ఇవ్వాలంటూ ఎంపీ చేతుల్లో ఉన్న వస్త్రాలను ఎమ్మెల్యే కొలికలపూడి బలవంతంగా లాక్కున్నారు. వాటిని తన తలపై పెట్టుకుని స్వామివారికి సమర్పించేందుకు ప్రయత్నించారు.ఎమ్మెల్యే చర్యతో ఖంగుతిన్న ఎంపీ వర్గీయులు, ఆయన తలపై ఉన్న పట్టువస్త్రాలను తిరిగి లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఆలయ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. స్వామివారి సన్నిధిలో రాజకీయ విభేదాలను ప్రదర్శించడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ మర్యాదలకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు.రాజకీయ వివాదాలను పార్టీ వేదికలకే పరిమితం చేయాలని, పవిత్ర దేవాలయాలను రచ్చబండగా మార్చవద్దని భక్తులు కోరుతున్నారు.
