లండన్ థేమ్స్ తరహాలో మూసీ మేకోవర్ స్టార్ట్… రూ.7,345 కోట్లతో తొలిదశకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.

July 10, 2026 12:14 PM
Musi River Phase-1 development project approved in Hyderabad.

Telangana: మూసీ నది రూపురేఖలను మార్చేసే ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశకు తెలంగాణ సర్కారు అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ జారీ చేసింది. భూసేకరణ ఖర్చు కాకుండా, కేవలం 6 శాతం నిర్వహణ ఖర్చులతో కూడిన రూ.7,345.12 కోట్ల భారీ బడ్జెట్‌కు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రభుత్వ పరిపాలన అనుమతులు రావడంతో, వెంటనే సాంకేతిక అనుమతులు పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తామని మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎంఆర్‌డీసీఎల్‌) స్పష్టం చేసింది. హైదరాబాద్‌ పరిధిలోని 55 కిలోమీటర్ల మూసీ నదీ మార్గంతో పాటు, ఇరువైపులా 200 చదరపు కిలోమీటర్ల పరిధిని అంతర్జాతీయ స్థాయిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఇందుకోసం మొత్తం పరీవాహక ప్రాంతాన్ని ఐదు జోన్లుగా విభజించింది.

జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వరకు ఉన్న 21 కిలోమీటర్ల నదీ మార్గాన్ని మొదటి దశ (జోన్-1) కింద అభివృద్ధి చేయనున్నారు. దీన్ని మళ్లీ రెండు విభాగాలుగా వర్గీకరించారు. మొదటిదైన జోన్-1A కింద హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న 9.20 కిలోమీటర్ల అభివృద్ధికి రూ.3,232.01 కోట్లు వెచ్చించనుండగా, జోన్-1B కింద ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న 11.80 కిలోమీటర్ల మేర నదీ మార్గ అభివృద్ధికి రూ.4,113.11 కోట్లు కేటాయించారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం నిధుల సమీకరణను పక్కా వ్యూహంతో సిద్ధం చేశారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మధ్యవర్తిత్వంతో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఈ ప్రాజెక్టుకు రూ.4,500 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే, ఇందుకు ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి రెండేళ్లలో తన వాటాగా రూ.2,845.12 కోట్లను కేటాయించాల్సి ఉంటుంది.

ఈ మేరకు ఏడీబీ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వాటాను హెచ్‌ఎండీఏ , టీజీఐఐసీ సంస్థలు సంయుక్తంగా సమకూరుస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏడీబీ గతంలోనే ఈ రుణానికి సూత్రప్రాయ అంగీకారం తెలపడంతో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా ముందడుగు వేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media