అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతరలో త్రాగునీటి కొరత తీవ్ర ఇబ్బందులకు దారితీస్తోంది. టిడిపి చింతపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు.
వేలాదిమంది భక్తులు, వ్యాపారులు జాతరకు తరలివస్తున్నప్పటికీ పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన త్రాగునీటి ట్యాంకర్లు ఖాళీగా ఉండడం విమర్శలకు దారితీస్తోంది. మండుతున్న ఎండల్లో భక్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు త్రాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.ప్రతి సంవత్సరం భారీగా జరిగే ఈ జాతరలో ముందస్తు ప్రణాళికల లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆనందరావు ఆరోపించారు. కేవలం ట్యాంకులు ఏర్పాటు చేయడం సరిపోదని, నిరంతర నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై అదనపు ట్యాంకర్లు, త్రాగునీటి పాయింట్లు ఏర్పాటు చేసి భక్తులకు ఉపశమనం కల్పించాలని కోరారు.
