చింతపల్లి శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర సందర్భంగా భక్తుల భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ నవజ్యోతి మిశ్రా హెచ్చరించారు.
జాతరలో అల్లరి, ఈవ్‌టీజింగ్, అసభ్య ప్రవర్తన, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాలు, ప్రధాన కూడళ్లు మరియు జాతర ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మఫ్టీ పోలీసులు, ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపి అనుమానాస్పద కదలికలపై కళ్లెం వేస్తున్నామని చెప్పారు. మహిళలు, చిన్నారులతో వచ్చే కుటుంబాల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని, వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. భక్తులు పోలీసులకు సహకరించి జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలని కోరారు.
