జిల్లాలోని కుమ్మెర జాతరలో జరిగిన గొడవ ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. జాతర నిర్వాహకుల దాడిలో తన 3 నెలల చంటి బిడ్డ మృతి చెందిందంటూ బాధితురాలు చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
దైవ దర్శనానికి వెళ్తున్న తమను జాతర నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి, మధు, శ్రీకాంత్ రెడ్డి మరికొందరితో కలిసి అకారణంగా దూషించి, విచక్షణారహితంగా దాడి చేశారని బాధితురాలు పేర్కొంది.దాడి సమయంలో చంటి బిడ్డను ఎత్తుకున్న తనను బలంగా తోసివేయడంతో కింద పడ్డానని, ఆ దెబ్బకు అస్వస్థతకు గురైన తన 3 నెలల కూతురు రెండు రోజుల తర్వాత మృతి చెందిందని చంద్రకళ కన్నీరుమున్నీరైంది. తమపై భౌతిక దాడి చేయడమే కాకుండా, కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించి అవమానించారని బాధితులు ఫిర్యాదులో వివరించారు. తమపై దాడి చేయడమే కాకుండా, తమ కుటుంబంలోని ఐదుగురిపై ఎదురు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తమ బిడ్డ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం పోలీసులను వేడుకుంటోంది.
