సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘సురక్ష కా తిరంగా’ కార్యక్రమం
రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: నాగార్జున కీలక వ్యాఖ్యలు సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ‘సురక్ష కా తిరంగా’ ప్రత్యేక సైబర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా SPARK క్లబ్ విద్యార్థుల ప్రతినిధులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సైబర్ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.
నాగార్జున తనకు ఎదురైన సైబర్ ఫ్రాడ్ అనుభవాన్ని ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినేనని చెప్పారు. నాలుగేళ్ల క్రితం తాను సైబర్ ఫ్రాడ్‌కు గురయ్యానని వెల్లడించారు.
బ్యాంక్ అధికారి పేరుతో ఫోన్
తనకు బ్యాంక్ అధికారి పేరుతో ఒక కాల్ వచ్చిందని నాగార్జున చెప్పారు. ‘‘నాగార్జున గారు మీరు బిజినెస్‌లో చాలా స్మార్ట్ అని విన్నాను..
మరి ఎందుకు ఇన్వెస్ట్ చేయడం లేదు. చాలా గొప్ప లాభాలు ఇచ్చే స్కీమ్ ఇది’’ అంటూ ఆ వ్యక్తి తనను నమ్మించాడని తెలిపారు.
సాధారణంగా తన ఆర్థిక వ్యవహారాలన్నీ తన మేనేజర్ చూసుకుంటారని నాగార్జున వివరించారు. అయితే నేరుగా తనకే ఫోన్ రావడంతో ఆ వ్యక్తి చెప్పిన మాటలను నిజమని నమ్మానని చెప్పారు.
మాటల్లో పెట్టి తనను మోసం చేశాడని నాగార్జున పేర్కొన్నారు. సైబర్ నేరాలు ఎవరికైనా జరగవచ్చని తన అనుభవం ద్వారా ప్రజలకు వివరించారు.
ఇరాన్లో బంధువుకు మరో సైబర్ మోసం ప్రయత్నం
తన బంధువుకు ఎదురైన మరో ఘటనను కూడా నాగార్జున వివరించారు. తన బంధువు షూటింగ్ కోసం ఇరాన్ వెళ్లారని చెప్పారు.
ఆమె ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన కొన్ని నిమిషాలకే ఒక ఫోన్ కాల్ వచ్చిందన్నారు.
‘‘మేము పోలీసులం.. మీ బ్యాగేజ్లో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి’’ అని ఫోన్లో చెప్పారని నాగార్జున తెలిపారు.
అంతటితో ఆగకుండా రూమ్ నుంచి కదలవద్దని వీడియో కాల్లో చెప్పారని వివరించారు.
అయితే తన బంధువుకు సైబర్ ఫ్రాడ్‌పై అవగాహన ఉండటంతో వెంటనే పోలీసులకు కాల్ చేసిందని నాగార్జున చెప్పారు.
ఆ తర్వాత తనకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పిందని వివరించారు.
రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా బాధితులు: CV ఆనంద్
డీజీపీ CV ఆనంద్ మాట్లాడుతూ సైబర్ నేరాల బారినపడుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని చెప్పారు.
అందుకే ‘సురక్ష కా తిరంగా’ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్‌ను భాగస్వామ్యం చేస్తూ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోందని CV ఆనంద్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం వరకు ఫిజికల్ దోపిడీలు జరిగేవని తెలిపారు. ఇప్పుడు నార్కోటిక్ నేరాలు, సైబర్ నేరాలు పెరిగాయని వివరించారు.
నార్కోటిక్స్ బారినపడి విద్యార్థులు, యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి
సాయి పల్లవి చీరకట్టుకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. దీపావళికి పర్ఫెక్ట్ ట్రెడిషనల్ లుక్!
40 రకాల సైబర్ నేరాల గుర్తింపు
సైబర్ నేరాల బారినపడుతున్న కొందరు ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడుతున్నారని CV ఆనంద్ చెప్పారు. ‘‘ఎవరు ఏం అనుకుంటారో’’ అనే ఆలోచనతో జరిగిన మోసాన్ని బయటకు చెప్పుకోవడం లేదన్నారు.
ఇప్పటివరకు 40 రకాల సైబర్ నేరాలను గుర్తించామని CV ఆనంద్ తెలిపారు. ఇందులో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉంటున్నాయని చెప్పారు.
సైబర్ నేరాలను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని వివరించారు.
పోలీసులు ఎంత అడ్డుకట్ట వేస్తున్నా సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతూ కొత్తగా మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
‘Stay Alert • Stay Aware • Stay Safe & Secure’
ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కార్యక్రమంలో సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్లు,
అనుమానాస్పద వీడియో కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు.
‘Stay Alert • Stay Aware • Stay Safe & Secure’ అనే నినాదంతో ప్రజలు సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


