రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ సీతారామాలయంలో అరుదైన విశేషం
3 ముఖ్యాంశాలు
- గంభీరావుపేట శ్రీ సీతారామాలయంలో 700 ఏళ్లుగా నందా దీపం వెలుగుతోందని భక్తుల విశ్వాసం.
- క్రీస్తు శకం 1314లో కాకతీయుల కాలంలో ఆలయం నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి.
- శ్రీరామనవమి సందర్భంగా 9 రోజుల పాటు ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
700 ఏళ్లుగా ఆరని జ్యోతి..
బద్రీనాథ్ ఆలయం ఆరు నెలల పాటు మంచుతో కప్పబడి ఉన్నా.. గర్భగుడిలోని జ్యోతి వెలుగుతూనే ఉంటుందని చాలామంది వినే ఉంటారు. ఇప్పుడు అలాంటి విశేషమే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిపిస్తోంది. గంభీరావుపేటలోని శ్రీ సీతారామాలయంలో ఉన్న నందా దీపం సుమారు 700 ఏళ్లుగా వెలుగుతూనే ఉందని భక్తులు చెబుతున్నారు.
స్వామివారి ముందు వెలుగుతున్న ఈ దీపం కేవలం వెలుగు మాత్రమే కాదని.. శతాబ్దాలుగా కొనసాగుతున్న విశ్వాసానికి ప్రతీక అని గ్రామస్థులు భావిస్తున్నారు. ఈ నందా దీపం గంభీరావుపేటకు ప్రత్యేక ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలిచింది.
కాకతీయుల కాలంలో నిర్మాణం
క్రీస్తు శకం 1314వ సంవత్సరంలో కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. మూల విగ్రహాల ప్రతిష్ఠకు ముందే ఇక్కడ నందా దీపాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతున్నారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు దీపం ఆరకుండా వెలుగుతూనే ఉందని ఆలయానికి వచ్చే భక్తులు విశ్వసిస్తున్నారు. భక్తులు నందా దీపానికి నూనె సమర్పిస్తూ జ్యోతి ఆరిపోకుండా చూసుకుంటున్నారని చెబుతున్నారు.
గ్రామానికి దైవ అనుగ్రహమని నమ్మకం
నందా దీపం వెలుగుతుండటం వల్ల గ్రామంలో ఐశ్వర్యం, పంటలు, శాంతి కొనసాగుతాయని గ్రామస్థుల నమ్మకం. ఈ జ్యోతిని దైవ అనుగ్రహానికి ప్రత్యక్ష రూపంగా వారు భావిస్తారు.
ఆలయం కేవలం భక్తికి సంబంధించిన ప్రదేశంగానే కాకుండా కాకతీయుల కాలం నాటి శిల్పకళకు కూడా ప్రతీకగా నిలుస్తోంది. ఆలయంలో 16, 18 రాతి స్తంభాలతో కూడిన అద్భుత మండపాలు ఉన్నాయి. చతురస్రాకార నిర్మాణ శైలి, రాతి శిల్పాల్లో కనిపించే నైపుణ్యం ఆకట్టుకుంటాయి. కాకతీయుల కాలం నాటి కళాత్మక ప్రతిభను ఈ నిర్మాణం ప్రతిబింబిస్తోంది.
శ్రీరామనవమికి ఘనంగా ఉత్సవాలు
ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. 9 రోజుల పాటు నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. సీతారామ కళ్యాణంతో పాటు భద్రాచలం తరహాలో అశ్వ, గజ, గరుడ, హనుమత్, శేష వాహన సేవలు నిర్వహిస్తారు.
అలాగే రథోత్సవం, ఏకాంత సేవ వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా హాజరవుతారు.
భక్తులకు అన్నదానం
ఉత్సవాల సమయంలో దాతల సహకారంతో నిర్వహించే అన్నదానం ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి. గ్రామస్థులు కూడా సమిష్టిగా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ భక్తులకు సేవలు అందిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా గ్రామ ప్రజల సహకారంతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో ఆలయం మరింత శోభాయమానంగా మారింది. 700 ఏళ్లుగా వెలుగుతున్న నందా దీపంతో పాటు కాకతీయుల కాలం నాటి నిర్మాణం, ఘనమైన ఉత్సవాలతో గంభీరావుపేట శ్రీ సీతారామాలయం భక్తులను ఆకట్టుకుంటోంది.


